Friday, May 24, 2024

సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పుకుంటున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ హితవు పలికారు. సోమవారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులతో పాటు పెన్షనర్ల కుటుంబాలు ఎలా ఉన్నాయో ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని విమర్శించారు. ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలివ్వడం లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు సైతం సకాలంలో పెన్షన్ ను ఇవ్వకపోవడం దారుణమన్నారు. గత రెండు నెలలుగా చాలా జిల్లాల్లో రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేదన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలుంటాయని, ఆసుపత్రులకు, మెడిసిన్, పౌష్టికాహారం కోసం డబ్బులు తప్పనిసరిగా అవసరమవుతాయని తెలిసి కూడా వారికి పెన్షన్ సకాలంలో చెల్లించకపోవడం అమానవీయమన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ మీ పాలనా పుణ్యమా అని అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదని, రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు అదే రోజున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పిన మీ మాట ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు.

నెలల తరబడి రిటైర్డ్ ఉద్యోగులంతా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 460 మంది ఉద్యోగుల పెన్షన్ ఫైళ్లు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేలాది మంది మంది రిటైర్డ్ ఉద్యోగులది ఇదే పరిస్థితి అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్‌ను నిర్వీర్యం చేసి, వారికి వైద్య సేవలు అందకుండా చేశారన్నారు. ప్రమోషన్లు, పోస్టింగుల్లో మీ వందిమాగదులను నియమించుకుని, అర్హులకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఎన్నో విలువైన సూచనలు చేసినా అమలు చేసిన దాఖలాల్లేవు. ఇదేనా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే..? ఈ నెలాఖరుతో మొదటి పీఆర్సీ గడువు ముగియబోతోంది. వచ్చే నెల నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలి. కానీ ఇప్పటి వరకు మీరు కనీసం పీఆర్సీ కమిషన్ ను నియమించకపోవడమంటే ఉద్యోగులను, ఉపాధ్యాయులను దగా చేయడమే. కొత్త పీఆర్సీ అసలు అవసరమే లేదని, ఉద్యోగులు, పెన్షనర్లు మీకు ఓటెయ్యరని.. మీరు మీ సన్నిహితులతో అన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయని విమర్శంచారు.

మీరు ఇచ్చే హామీలు, కొట్టే కొబ్బరి కాయలన్నీ ఓట్ల కోసమేనని తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలోనూ ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుండడం బాధాకమని, ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలన్నది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రమన్న విషయాన్ని మీరు పూర్తిగా విస్మరించారని లేఖలో విమర్శించారు. ‘మీకు ఓట్లు, సీట్లే తప్ప ప్రజల బాగోగులు పట్టకపోవడం దుర్మార్గం. ఒకవేళ ఓట్ల కోణంలో ఆలోచించినా‌ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ఓట్లు రాష్ట్రంలో 30 లక్షలకు పైనే ఉన్నాయనే విషయాన్ని విస్మరించడం శోచనీయం. తక్షణమే పెన్షనర్లందరికీ పెన్షన్ ను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, తక్షణమే పీఆర్సీ వేసి ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్న విధంగా వేతనాలు, డీఏ పెంచాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే ఉద్యోగుల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

- Advertisement -spot_img
- Advertisement -spot_img