బిల్డింగ్‌ పర్మిషన్స్‌ ఫైల్స్‌ క్లియర్‌గా ఉండాలి

15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష‌


ప్రజానావ, ఖైరతాబాద్‌: జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ ప‌రిధిలో బిల్డింగ్ అనుమతులకు సంబంధించిన ఫైల్స్‌ క్లియ‌ర్‌గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శనివారం ఆయన హెచ్ఎండీఏ కార్యాల‌యంలో వాట‌ర్ వ‌ర్క్స్‌, మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, జీహెచ్ఎంసీ అధికారులతో స‌మీక్షించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ చాలా బిల్డింగ్స్ అనుమ‌తుల‌కు సంబంధించిన ఫైల్స్ క‌నిపించ‌డం లేదని, ఆన్‌లైన్ లేకుండా ఇష్టారీతిగా ప‌ర్మిష‌న్లు ఇచ్చారన్నారు.

15 రోజుల్లో హెచ్ంఎండీఏ, జీహెచ్ఎంసీలో విజిలెన్స్ దాడులు జ‌రుగుతాయని, ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించిన అధికారులు ఇంటికిపోతారని హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లో లేకుండా ఇచ్చిన అనుమ‌తుల జాబితా త‌యారు చేయాలని, హెచ్ ఎండీఏ వెబ్‌సైట్ నుంచి చెరువుల ఆన్‌లైన్ డేటా ఎందుకు డిలీట్ అవుతోందని అధికారులను ప్రశ్నించారు.

3,500 చెరువుల డేటా ఆన్‌లైన్‌లో ఉండాల్సిందేనని, చెరువులు ఆక్ర‌మ‌ణ‌కు గురికాకుండా వాటి వ‌ద్ద త‌క్ష‌ణ‌మే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని పురపాలక సమీక్షలో అధికారులకు సూచించారు.

కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై ఈ సందర్భంగా సీఎం ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు.

ఆర్థిక శాఖ ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్-1 అధికారులు క‌మిష‌న‌ర్లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశించారు.

కొత్త కార్పొరేష‌న్ల‌కు కూడా ఐఏఎస్‌ల‌నే క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించాల‌ని ఆయన సూచించారు.

కుటుంబసభ్యులకు అవకాశమివ్వాలి


వ‌య‌స్సు పైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

జీహెచ్ఎంసీ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప‌నిచేసే మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌మాద బీమా క‌ల్పించ‌డంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేలా చూడాలన్నారు. హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌న్నారు.

ఉద‌య‌మే లేచి కాల‌నీల్లో ప‌ర్య‌టించని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు ఇంటికి వెళ్లిపోవ‌చ్చన్నారు. కుర్చీల్లో కూర్చొనే పోస్టులు కావాలంటే ఇస్తామంటూ కొందరు అధికారులకు చురకలంటించారు.

హైద‌రాబాద్‌లో న్యూయార్క్ టైమ్ స్క్వేర్ త‌ర‌హాలో వీడియో ప్ర‌క‌ట‌న‌ల బోర్డు ఏర్పాటు చేయాల‌ని, మ‌ల్టీ యుటిలిటీ ట‌వ‌ర్స్‌ను ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.

అలాగే విధి దీపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఎక్కడా నీటి కొరత రావొద్దు


అనంతరం వాట‌ర్ వ‌ర్క్స్ స‌మీక్ష‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రానికి మంచి నీటి కొర‌త లేకుండా చూడాల‌ని అధికారులను ఆదేశించారు.

స్థానిక చెరువుల‌ను స్టోరేజీ ట్యాంకులుగా ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, కొండ‌పోచ‌మ్మ, రంగ‌నాయ‌క సాగ‌ర్ నుంచి హైద‌రాబాద్‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా అయ్యేలా ప్ర‌ణాళిక ర‌చించాల‌న్నారు.

ఔట‌ర్ రింగు రోడ్డు బ‌య‌ట ఉన్న చెరువుల‌ను క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించడంతో పాటు వ‌చ్చే 50 ఏళ్ల తాగు నీటి అవ‌స‌రాల కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చించాల‌ని అధికారుల‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఉన్న‌తాధికారులు దాన కిషోర్‌, ఆమ్ర‌పాలితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.